కళ్లకి కాటుక పెట్టుకోవడం వల్ల అమ్మాయిల అందం మరింత పెరుగుతుంది. కళ్లు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే ఆకర్షణీయంగా కనబడతాయి. అయితే కళ్లు నలపడం, చెమట ఇతరత్రా కారణాల వల్ల కాటుక చెరిగిపోయి కంటి చుట్టూ నల్లగా తయారవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి.
ఏ రకమైన మేకప్ వేసుకోవాలనుకున్నా ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి. తరువాతే కాటుక పెట్టుకోవాలి. మేకప్ వేసుకోవాలి.
మీ చర్మానికి ఎక్కువగా చెమట పట్టే గుణముంటే ఐస్ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడం తగ్గుతుంది. తద్వారా కాటుక కూడా చెదరకుండా ఉంటుంది.
కాటుక పెట్టుకునే ముందు కాటన్ వస్త్రంతో కనురెప్పను శుభ్రంగా తుడుచుకోవాలి. కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగాపోయిన తరువాత మాత్రమే కాటుక పెట్టుకోవాలి.
ఫేస్ పౌడర్ వాడడం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా చేయవచ్చు. కళ్ల చుట్టూ కొద్దిగా ఫేస్ పౌడర్ రాసుకోవాలి. అక్కడి చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్ పీల్చుకోవడం వల్ల కళ్లు చాలా తాజాగా ఉంటాయి.
కనురెప్పల చివర భాగంలో కాటుకను పెట్టుకోవడం వల్ల చెరిగిపోయే అవకాశం ఎక్కువ. అందుకని కనురెప్పల మధ్యభాగంలో మాత్రమే కాటుక పెట్టుకోవాలి.
కళ్లకి కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్ కలర్ ఐషాడోని బేస్‌గా వేసుకోవాలి. ఆ తరువాత కళ్లకి కాటుక పెట్టుకోవాలి. కళ్ల చుట్టూ కాటుక చెదిరిపోకుండా చూసుకోవడానికి ఇదొక సులభమైన మార్గం.
మందంగా, చక్కగాపడే సన్నని కాటుక పెన్సిల్‌ని ఎంచుకోవడం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా చూసుకోవచ్చు.

0 comments:
Post a Comment