రుమటాయిడ్ ఆర్థరైటిస్ జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స లేదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అందుకే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. సమస్య బాగా ముదిరిన తరువాత, కీళ్లు బాగా దెబ్బతిన్న దశలో డాక్టర్ దగ్గరకు పరుగెత్తుతారు. నిజానికి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడే అవకాశం ఉంటుందని అంటున్నారు రుమటాలజిస్ట్ డాక్టర్ ధీరజ్.
యుక్తవయస్సులో ఉన్న వారు, వయసు పైబడిన వారు అనే తేడా లేకుండా అందరినీ బాధిస్తోన్న సమస్య ఆర్థరైటిస్. అందులో ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే ఎముకలకు నష్టం జరగకుండా, ఇతర సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. అనేక పరిశోధనల ఫలితంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కొత్త మందులు అందుబాటులో వచ్చాయి. ఈ మందులతో కీళ్లు దెబ్బతినకుండా కాపాడే అవకాశం ఉంది. ప్రాథమిక దశలో గుర్తించడం, చికిత్స త్వరగా ఆరంభించడం, క్రమంతప్పకుండా మందులు వాడటం, వైద్యుల సలహా తీసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, ఫిజియోథెరపీ, వ్యాయామం చేయడం వంటివి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణలో చక్కగా ఉపయోగపడతాయి.
వ్యాధిని గుర్తించండిలా....
బిగుసుకుపోవడం : ఉదయాన నిద్ర లేవగానే అరగంట పాటు కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం జరుగుతుంది.
వాపు : కీళ్లల్లో ముఖ్యంగా చేతి కీళ్లలో వాపులు వస్తుంటాయి.
నొప్పి : కరచాలనం చేసినా, చేతిని ముట్టుకున్నా విపరీతమైన నొప్పి ఉంటుంది.
ఎవరిని కలవాలి?
రుమటాలజిస్ట్‌ను కలవడం ద్వారా సరియైన వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఏ విధమైన చికిత్స అందించాలనే విషయంలో రుమటాలజిస్ట్‌కు నైపుణ్యం ఉంటుంది. రుమటాలజిస్ట్ ఒక ఫిజీషియన్‌గా కీళ్ల నొప్పులపైనే దృష్టి పెట్టడం కాకుండా లింఫ్‌గ్రంఽధుల్లో వాపు, గుండె, ఊపిరితిత్తుల పైపొరలో వాపు, వాస్క్యులైటిక్ న్యూరోపతి, వాస్క్యులైటిక్ అల్సర్, ప్లీహం(స్ప్లీన్) పెద్దది కావడం వంటి ఇతర సమస్యలను పరిశీలిస్తారు. గుండె జబ్బులు వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. గుండె జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు, ఆర్థరైటిస్ మూలంగా పురుషుల్లో ఏడేళ్లు, స్త్రీలలో మూడేళ్ల జీవితకాలం తగ్గిపోతోంది. అందుకే నిర్లక్ష్యం చేయకుండా కీళ్ల నొప్పులు బాధిస్తున్నట్లయితే రుమటాలజిస్ట్‌ను కలవాలి.
డాక్టర్‌ను కలిసిన తరువాత...
అవసరమైన పరీక్షలు చేసి, లక్షణాలు పరిశీలించిన తరువాత వైద్యులు తగిన మందులు సూచిస్తారు. అయితే మందులు తీసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే వ్యాధి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
మందులు వేసుకోవడం : కీళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా మందులు వాడటం మొదలుపెట్టాలి. మందులు వాడటం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ వస్తాయని భావిస్తుంటారు. కానీ రుమటాలజిస్ట్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే మందులు రాయడం జరుగుతుంది. కాబట్టి మందులు వేసుకోవడం మరవద్దు. నొప్పులు తగ్గాయని మందులు ఆపితే : మందులు వేసుకోవడం ప్రారంభించిన తరువాత కొద్ది రోజుల్లోనే నొప్పులు, వాపులు తగ్గుతాయి. మంచి రిలీఫ్ వస్తుంది. దాంతో ఇక మందులు అవసరం లేదని ఆపేస్తుంటారు. కానీ అది చాలా పొరపాటు. మందులు ఆపేయడం వల్ల తిరిగి వాపు, నొప్పి ప్రారంభమవుతుంది. ఆ తరువాత తగ్గడం చాలా కష్టమవుతుంది.
సొంత వైద్యం పనికి రాదు : ఒకసారి వైద్యుల దగ్గరకు వెళ్లి అవే మందులను దీర్ఘకాలం వాడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వ్యాధి తీవ్రతను బట్టి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వ్యాధి తీవ్రతను అంచనా వేయడం, మందులకు రెస్పాన్స్ వస్తున్న తీరు, మందుల వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు వంటివి డాక్టర్ పరిశీలించి మందులను సూచించడం జరుగుతుంది. కాబట్టి సొంత వైద్యం పక్కన బెట్టి క్రమంతప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
శారీరక వ్యాయామం తప్పనిసరి : సంపూర్ణ ఆరోగ్యానికి శారీరక వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. వ్యాయామం వల్ల కీళ్లలో ఫ్లెక్సిబులిటీ వస్తుంది. బిగుసుకుపోవడం తగ్గిపోతుంది.
స్మోకింగ్‌కు స్వస్తి చెప్పండి : పొగతాగే అలవాటు ఉంటే మానేయడం, నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
డైట్ : రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు ఆహార నియమాలు పాటించాలని లేదు. అయితే వారంలో రెండు రోజులు చేపలు తీసుకోవడం వల్ల కార్డియాక్ రిస్క్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ఉంటాయి. చేపలు ఇష్టం లేకపోతే వాల్‌నట్స్, సోయాబీన్స్ తీసుకోవచ్చు.
డా. కె.ధీరజ్
రుమటాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
మలక్‌పేట్, హైదరాబాద్
ఫోన్ : 90000 09144

0 comments:
Post a Comment