క్షయవ్యాధి ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియాతో వ్యాపిస్తోంది. ప్రపంచ జనాభాలో మూడోవంతుమందికి ట్యూబర్‌క్యులోసిస్ (టీబీ) వ్యాధి సోకుతుంది. ప్రతి ఏటా 9 మిలియన్‌ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇటీవల టీబీ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సత్వర చికిత్స చేయకుంటే ప్రాణాంతకం కూడా కానున్న ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చికిత్స, ముందుజాగ్రత్తల గురించి వివరిస్తున్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ యం. గంగాధర్‌రెడ్డి.
ప్రపంచంలో క్షయ వ్యాధి (టీబీ) సెకనుకు ఒకరికి సోకుతుంది. ప్రతి నిమిషానికి ఒకరు ఈ వ్యాధి వల్ల మృత్యువాత పడుతున్నారు. ప్రపంచంలోనే టీబీ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో మన దేశం ప్రథమం. సాధారణంగా ఈ ట్యూబర్‌క్లోసెస్ బ్యాక్టీరియా ఊపిరితిత్తులకు సోకుతుంది. కొన్ని సార్లు శరీరంలోని కిడ్నీలు, ఎముకలు, మెదడుకు కూడా ఈ బ్యాక్టీరియా సోకవచ్చు. సరైన సమయంలో సరైన చికిత్స చేయించుకోకుంటే ప్రాణాంతకం కూడా కావచ్చు. దగ్గటం ద్వారా వాతావరణంలోకి టీబీ వ్యాధిగ్రస్థుల నుంచి ఈ బ్యాక్టీరియా గాలిలోకి వచ్చి ఆ గాలిని ఇతరులు పీల్చినపుడు టీబీ వచ్చే అవకాశముంది. రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న వారికి, మధుమేహం, హెచ్‌ఐవి వ్యాధులు ఉన్న వారికి టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతోపాటు ధూమపానం, మద్యపానం అలవాటున్న వారికి, పోషకాహారం లేక బలహీనంగా ఉండేవారికి, చిన్న పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాధి వచ్చే అవకాశముంది.
లక్షణాలు : మూడు వారాలకంటే దగ్గు ఎక్కువగా ఉన్నా, జ్వరం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం, దగ్గినపుడు రక్తం పడటం, రాత్రివేళ చెమట పట్టడం టీబీ వ్యాధి లక్షణాలు.
నిర్ధారణ పరీక్షలు : క్షయవ్యాధిని నిర్ధారించుకునేందుకు సాధారణంగా ఛాతీ ఎక్స్‌రేలు తీస్తుంటారు. దీంతోపాటు కళ్లె పరీక్ష, స్కిన్ టెస్ట్, టీబీ ఫెరాన్ గోల్డ్ పేరిట చేసే కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స
ఆధునిక వైద్య విధానాల ద్వారా సరైన సమయంలో సరైన చికిత్స పొందితే టీబీని పూర్తిగా నయం చేయవచ్చు. ఆరు రకాల టీబీ మందులను కీమోథెరపీ మందులు అంటారు. ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు డాక్టర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. సరైన మోతాదులో సరైన మందులు వాడకుంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. అప్పుడు సెకండ్ లైన్ డ్రగ్స్ వాడాలి. అలాంటపుడు సైడ్ ఎఫెకులుంటాయి. వ్యాధిని గుర్తించిన మొదటి దశలో చిన్న పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు టీబీ రోగి దూరంగా ఉంటే మంచిది. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినపుడు ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అందువల్ల దగ్గినపుడు నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. రెండునెలలపాటు మందులు వాడితే టీబీ పేషంట్ నుంచి వ్యాధిని వ్యాప్తి చేసే బ్యాక్టిరియాను కొంత తగ్గించవచ్చు.
బీసీజీ వ్యాక్సిన్
చిన్న పిల్లలు పుట్టినపుడు వెంటనే వారికి టీబీని నివారించే బీసీజీ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. అయినా ఈ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా టీబీ రాదనే గ్యారంటీ లేదు. ఈ వ్యాక్సిన్ వందశాతం రక్షణ ఇవ్వటం లేదు.
జాగ్రత్తలు
కొన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా టీబీని దరిచేరకుండా చూసుకోవచ్చు.
పోషకాలతో కూడిన బ్యాలెన్స్ డైట్‌ను తీసుకోవటం ద్వారా బలహీనంగా లేకుండా చూసుకోవాలి.
ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా హెల్తీ జీవనశైలిని అలవర్చుకోవాలి.
మద్యానికి దూరంగా ఉండాలి.
ధూమపానం అలవాటును మానుకోవాలి.
మధుమేహం వ్యాధి ఉన్న వారు ఆ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి.
రోగ నిరోధక శక్తి తగ్గకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
అపోహలు వద్దు
క్షయవ్యాధి విషయంలో రోగులకు పలు అపోహలున్నాయి. అపోహలను వీడి వైద్యుల సలహాతో సత్వర చికిత్స చేయించుకోవాలి.
ఒకసారి టీబీ వస్తే నివారణ లేదు అనే దాంట్లో వాస్తవం లేదు. ఆధునిక వైద్యం వల్ల నూటికి నూరు శాతం వ్యాధిని నివారించవచ్చు.
దగ్గినపుడు రక్తం పడితే టీబీ అని అపోహ పడాల్సిన అవసరం లేదు.
టీబీ ఒక్క ఊపిరితిత్తులకే కాదు శరీరంలోని ఏ అవయవానికైనా సోకే అవకాశముందని గుర్తించాలి.
టీబీ రోగిని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కానీ దగ్గినపుడు మాత్రమే నోటికి గుడ్డ అడ్డం పెట్టుకొని ట్యూబర్‌క్లోసెస్ బ్యాక్టిరియా వ్యాపించకుండా చూసుకుంటే చాలు.
టీబీ రోగిని ముట్టుకున్నా, పట్టుకున్నా వ్యాధి సోకదని గుర్తించాలి.
డాక్టర్ యం. గంగాధర్‌రెడ్డి
సీనియర్ పల్మనాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
హైదరాబాద్
ఫోన్ : 90520 46666

0 comments:
Post a Comment